2025 Admissions to Jvvv to Open from Dec 8, 2024.
విద్య మూలాలు తెలిసిన విద్యావేత్తలు, పిల్లల వికసన క్రమం గురించి కృషి చేసిన శాస్త్రజ్ఞులు, సమాజ ప్రగతి కోరుకునే విజ్ఞులు అందరూ నినదిస్తున్న సత్యం - “పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడేదే విద్య” అని. అలాంటి విద్యనందించే ప్రయత్నమే నాలుగు దశాబ్దాలుగా నడుస్తున్న పోరంకిలోని వికాస విద్యావనం.
వికాస విద్యావనంలో 2+ నుండి 4+ సంవత్సరాల వయస్సు పిల్లలకు బొమ్మరిల్లు (ప్రీస్కూలు) తరగతులు. ఆటపాటలతోఉల్లాసంగా వారి జ్ఞానేంద్రియాలకు గాలి, నీరు, ఆహారంలానే ఎంతో అవసరమైన వ్యాయామాన్నివ్వడం ప్రధాన లక్ష్యంగా నడుస్తాయి ఈతరగతులు. ప్రాధమిక తరగతుల్లోకి వుత్సాహంగా అడుగు పెట్టేందుకు, స్కూలుకు రావడం మంచి అనుభవంగా వుండేందుకుబొమ్మరిల్లు తరగతులు తోడ్పడతాయి. భాషగా ఇంగ్లీషును వినడం, మాట్లాడడం ప్రీస్కూలులోనే మొదలవుతుంది.
బాలానందం తరగతుల్లో (6 - 10 సంవత్సరాల పిల్లలు) 20 మంది ఒక టీచర్ పర్యవేక్షణలో వుంటారు. నలుగురైదుగురితో చిన్నబృందాలుగా ఎవరి స్థాయిలో వాళ్లు తమదైన వేగంతో నేర్చుకునే వీలున్న తరగతి గదులు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో విద్యార్థులుక్రియాశీలంగా పాల్గొనడానికి పెద్దపీట.
బాలానందం 1 (2, 3 తరగతులు) కి వేరుగా, బాలానందం 2 (4, 5 తరగతులు) కి వేరుగా తెలుగు, ఇంగ్లీషు, గణితం, ఆర్ట్ & క్రాఫ్టు టీచర్ క్లాసురూములు వుంటాయి. తనకైన క్లాసురూం వుండటం వలన టీచరు తరగతి గదిని ఎప్పటికప్పుడు బోధనకుఅనుకూలంగా మార్చుకోవడానికి వీలవుతుంది. పిల్లలు ఒక వాతావరణం నుండి మరో వాతావరణానికి మారుతూ వుంటారు. బాలానందం 2 విద్యార్థులకు అదనంగా హింది, పరిసరాల విజ్ఞానం తరగతి గదులు వుంటాయి.
సమతుల్య ఆహారం అందించే క్రమంలో - రెండు సార్లు ఐదురకాల చిరుధాన్యాలు, పప్పుదినుసులతో జావ అందరూ త్రాగాలి; 8 గంటలకు వచ్చే పిల్లలకు ఇడ్లి/పొంగలి, కోడిగ్రుడ్డు; మధ్యాహ్నం ఒక పట్టు బియ్యంతో చేసి కలిపిన కూరన్నం/పులిహోర/పలావు తోపాటుగా పెరుగన్నం అందరూ తినాలి.
పనిపాట కార్యక్రమంలో బాలానందం 2 పిల్లలు టీచర్లతో కలిసి తరగతి గదులు, ఆవరణ, టాయిలెట్లు శుభ్రం చేయడం, తోటపని, కూరలు తరగటం చేస్తారు.
విజ్ఞానం వినోదం కోసం చుట్టుప్రక్కల ఆసక్తిగా వుండే ప్రదేశాల సందర్శన, ప్రకృతి పరిసరాలలో సరదా షికార్లు చేస్తారు.
వికాస విద్యావనంలో ....ఎటువంటి శిక్షలు లేవు. ఒకరితో మరొకరిని పోల్చడం కూడా శిక్షే. పిల్లలను ఆశపోతులుగా చేసేబహుమతులు కూడా లేవు. కనీసం గంటసేపైనా ఆటలు లేని రోజు వుండదు. పనీపాటలలో పాల్గొంటూ కాయకష్టం విలువతెలుసుకుంటారు. పోటీకి ప్రోత్సాహం లేదు. నిరంతర పరిశీలన ద్వారా పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వాళ్ళు నేర్చుకునే ప్రక్రియకుదోహదం చేసే ప్రయత్నం చేస్తాం.
వికాస విద్యావనం ప్రాధమికస్థాయిలో మాతృభాషే మాధ్యమం. ఇంగ్లీషును భాషగా నేర్చుకుంటారు. 5 వ తరగతి పూర్తిఅయేసరికి, ఆ తర్వాత చదువులు ఆంగ్ల మాధ్యమంలో వున్నా ఇబ్బంది పడరు. స్కూలు పుస్తకాలు స్కూలుకే పరిమితం. బడికి సంచిమోత లేదు. హోంవర్క్ లేదు. విద్యా ప్రణాళికలో పాఠ్యేతర అంశాలకు కనీసం మూడో వంతు సమయం. అసౌకర్యంగా అనిపించేయూనిఫారం లేదు ఆటపాటలు, బోధనపరికరాల మాధ్యమాలకు ప్రాధాన్యత.
విద్యార్థి సమగ్ర వికాసానికి తోడ్పడే విద్యా ప్రణాళిక అమలుజరిపే నిరంతర ప్రయత్నమే వికాస విద్యావనం.